రిజర్వేషన్లు 50శాతం వరకే ఎందుకు – ఈ రూల్ ఎలా వచ్చింది?

August 22, 2018

బ్రిటీష్ వాళ్లు కులం ఆధారంగా తీసుకొచ్చిన రిజర్వేషన్లు స్వతంత్ర్య భారతదేశంలోనూ అలాగే కొనసాగుతున్నాయి. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాప్రతినిధి, దళితులు, ఆదివాసీ, ఇతర వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అప్పట్లో బ్రిటీష్ పాలకులు.. వెనకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఈ రిజర్వేషన్ విధానాన్ని ఇండియాలో అమలు చేశారు. గణతంత్ర దేశంగా భారత్ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వాలు.. అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత ఓట్ల రాజకీయంగా మారిపోయింది ఇది.

50 శాతం రూల్ అంటే ఏమిటి :
1992లో సుప్రీంకోర్టు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిలిపివేసింది. రిజర్వేషన్లు, ప్రాధాన్యతలపై ఏ జాగ్రత్త లేకపోయినట్లయితే సమాజంలో సమానత్వం అనే కాన్సెప్ట్ దెబ్బతింటుంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం ఏ రిజర్వేషన్ కూడా 50శాతం మించకూడదని తెలిపింది.

ఈ రూల్ ఎలా వచ్చింది :
1979లో జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి.. దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది. దశాబ్ధకాలం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో మండల్ కమిషన్ రికమండేషన్లను అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. దీన్నే ఇంద్రశవాణీ కేసుగా పిలుస్తారు.

50శాతం వరకే ఎందుకు :
మండల్ కమిషన్ ద్వారా గుర్తించబడిన ఓబీసీలు 1931 జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్నారు. అప్పుడే చివరిసారిగా కులాల గణన జరిగింది. రిజర్వేషన్లు బాగానే ఉన్నప్పటికీ.. పాపులేషన్ తో సంబంధం లేకుండా రిజర్వేషన్లలో కోత విధించింది. ఆర్టికల్ 16 క్లాజ్(4) ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని చెప్పింది. న్యాయమైన, అర్ధవంతమైన లిమిట్స్ ని పరిశిలీంచినట్లు కోర్టు తెలిపింది. ఇక్కడే విశేషం ఏంటంటే.. ఓబీసీ జనాభా 52శాతం ఉన్నప్పటికీ.. 50శాతం అనేది ఎందుకు రీజనబుల్ అనేది ఇప్పటి వరకూ కోర్టు కూడా వివరణ ఇవ్వలేకపోయింది. వివరించనూ లేదు. ఓబీసీ రిజర్వేషన్ల మొత్తంలో ఓబీసీలకు 27శాతం, దళితులు, ఆదివాసీలు కలిపి 22.5శాతం రిజర్వేషన్ మొత్తం కలిపి 49.5 శాతం రిజర్వేషన్ పొందుతున్నారు.

తమిళనాడులో 69శాతం రిజర్వేషన్ ఎందుకు ?
తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో.. తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ 1993ని రిజర్వేషన్ లిమిట్ 69 శాతం చెక్కుచెదరకుండా ఉంచాలని బిల్లు పాస్ చేసింది. 1994లో పార్లమెంట్ పాస్ చేసిన 76వ రాజ్యాంగ సవరణ ద్వారా.. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో పొందపరిచారు.

ఇతర రాష్ట్రాలు ఎందుకు అనుకరించ లేదు? :

  • 2014లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బాంబే హైకోర్టు స్టే విధించింది.
  • రాజస్తాన్, ఒడిషా రాష్ట్రాలు కూడా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నాలు చేశాయి. సుప్రీంకోర్టు తీర్పు వల్ల సాధ్యం కాలేదు.
  • కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్లు, పోరాటాలు జరుగుతున్నప్పటికీ 50శాతం నిబంధన ఇబ్బందికరంగా మారింది. రెండేళ్లుగా రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమాలు హింసాత్మకంగా మారాయి
  • రిజర్వేషన్ లిమిట్ 55శాతం పెంచాలని ఏపీ, 62 శాతం వరకు పెంచాలని తెలంగాణ రాష్ట్రం, 70శాతం కోసం కర్ణాటక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించినా.. వాటి జోలికి మాత్రం వెళ్లటం లేదు కేంద్ర ప్రభుత్వాలు.
  • తమిళనాడు ఓన్ రిజర్వేషన్ పాలసీనే.. ఇప్పుడు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉంది.

ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.