నల్గొండ కంచుకోటను బద్దలుకొట్టే వ్యూహంలో టీఆర్ఎస్

August 8, 2018

తెలంగాణ రాజకీయాలకు.. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న.. కేంద్ర బిందువు నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీలోని హేమాహేమీలు ఈ జిల్లా నుంచే వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలదే ఇప్పటికీ కాంగ్రెస్‌లో పైచేయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు ఎమ్మెల్యే స్థానాలతో పాటు భువనగిరి ఎంపీ సీటుని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఆ తర్వాత మిర్యాలగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నల్లగొండ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కారెక్కేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కి మిగిలింది కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, నల్లగొండ మాత్రమే. అప్పుడు టీఆర్ఎస్ గెల్చిన ఆరు స్థానాలను.. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించిన సీట్లని ఈసారి ఎన్నికల్లో చేజార్చుకోరాదనే పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. నల్గొండపై పట్టు బిగిస్తేనే తెలంగాణ అంతా కాంగ్రెస్‌ ప్రభావం బలంగా ఉంటుందనేది ఆ పార్టీ నేతల ఆలోచన.

కాంగ్రెస్‌ నల్గొండ జిల్లాలో పట్టు బిగించాలనే పట్టుదలతో ఉంటే.. టీఆర్ఎస్ నేతలు అంతకంటే పదునైన వ్యూహంతోనే ముందుకు పోతున్నారు. కొన్ని నెలలుగా జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల దూకుడు చూసిన వారెవరికైనా ఈ విషయం అర్ధమవుతుంది. తమకున్న 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను తిరిగి మళ్లీ తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా తిరుగుతున్నారు. వాటితోపాటు మిగతా నాలుగు స్థానాల్ని కూడా గెలిచి కాంగ్రెస్‌ని చావుదెబ్బ తీయాలన్నదే టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నిలబెడితే పెద్దగా ఫలితం ఉండకపోవచ్చన్న ఆలోచనతో గులాబీబాస్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి గాలి వీయాలన్నా.. ఆ పార్టీకి మెజార్టీ వచ్చి సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయాలన్నా నల్లగొండ జిల్లానే కీలకం కావటంతో.. ఆ పార్టీకి ఎంతో కీలకమైన ఈ జిల్లాపై టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్‌గా గురిపెట్టినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత నల్లగొండ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. కవిత నల్గొండ నుంచి పోటీకి దిగితే.. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో గులాబీపార్టీకి తిరుగుండదనేది టీఆర్ఎస్ ఆలోచన. ముఖ్యంగా ఈ దెబ్బకు కాంగ్రెస్ అగ్రనేతలకు సొంత నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాతో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. కేసీఆర్‌ ఈ ఎత్తుగడను వేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నల్లగొండలోనే కాంగ్రెస్‌ దెబ్బతింటే.. మిగిలినచోట్ల ఆ పార్టీ లేవలేదనేది టీఆర్‌ఎస్‌ వ్యూహం. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎక్కడా బాహాటంగా మాట్లాడకపోయినా…అంతర్గతంగా మాత్రం చర్చించుకుంటున్నారు.

ఈ ప్రచారంపై కాంగ్రెస్ కూడా ఎక్కడా స్పందించలేదు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. బహుశా కవిత విషయం తెలిసే ఆయన ఎంపీగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారా అనేది ఇక్కడ పాయింట్. కవిత వచ్చినా కోమటిరెడ్డి లాంటి నాయకుడు బరిలో ఉంటే ఏ ఇబ్బందీ ఉండదని పార్టీ కూడా ఆలోచన చేసి ఉంటుందని క్యాడర్ చెప్పుకుంటుంది. అందుకే వెంకట్ రెడ్డి కూడా హఠాత్తుగా ఎంపీగా పోటీచేస్తానన్న నిర్ణయాన్ని ప్రకటించి ఉంటారన్న చర్చ అటు టీఆర్ఎస్. .ఇటు కాంగ్రెస్ క్యాడర్‌లో జరుగుతోంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.