ఇళ్ల దోపిడీల్లో నివురు సినిమా హీరో అరెస్ట్

August 15, 2018

మీరు షాక్ అవ్వొచ్చు.. అవునా అని నోరెళ్ల‌బెట్టొచ్చు.. నిజ‌మేనా అని ఆశ్చర్యం వ్య‌క్తం చేయొచ్చు.. కానీ ఇది పోలీసులు చెబుతున్న ప‌చ్చినిజం. ఓ సినిమాని నిర్మించి.. తానే హీరోగా నటించిన వ్య‌క్తి అరెస్ట్ అయ్యాడు. అది ఇళ్ల దోపిడీ కేసులో. ఆ సొమ్ముతోనే జ‌ల్సాలు చేస్తూ తిరుగుతూ అంద‌ర్నీ షాక్ కు గురి చేశాడు.

వివ‌రాల్లోకి వెళితే..
నివురు అనే సినిమా వ‌చ్చింది. అందులో హీరో మ‌హ‌దేవ్. అంద‌రూ మ‌హేష్ అంటారు. ఇటీవ‌లే ఈ సినిమా విడుద‌ల అయ్యింది. పెద్ద‌గా ఆడ‌క‌పోయినా.. సినీ ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యాలు మాత్రం బాగా పెంచుకున్నాడు. సినిమా ఆడ‌క‌పోవ‌టంతో న‌ష్టాలు వ‌చ్చాయి. అప్పులు బాగా పెరిగాయి. అప్పులు తీర్చ‌టానికి, ద‌ర్జాగా బ‌త‌క‌టానికి దొంగ‌త‌నాలు చేయాల‌ని నిర్ణ‌యించాడు. సినీ ఇండ‌స్ట్రీలోనే త‌న‌కు ప‌రిచ‌యం అయిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ విక్కీరాజ్ తో ఉన్న స్నేహంతో త‌న పార్ట‌న‌ర్ గా చేర్చుకున్నాడు. ఇద్ద‌రికీ డ‌బ్బులు అవ‌స‌రం. ఇంకేముందీ.. ఈజీగా డ‌బ్బులు సంపాదించ‌టానికి దొంగ‌త‌నాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్లాన్ వేశారు. కాల‌నీల్లో కారులో తిరుగుతూ రెక్కీ నిర్వ‌హించేవారు. ఏ ఇంటికి రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉందో గుర్తించేవారు. చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాలు ప‌రిశీలించేవారు. ఓ రాత్రి.. ఆ ఇంటి తాళాలు ప‌గ‌ల‌గొట్టి ఇంట్లోకి ప్ర‌వేశించేవారు. ఉన్న‌కాడికి దోచుకునే వారు. వ‌చ్చిన కారులోనే ద‌ర్జాగా వెళ్లిపోయేవారు.

ఇంట్లో డ‌బ్బు, న‌గ‌లు, న‌గ‌దుతోపాటు విలువైన వ‌స్తువుల‌ను కూడా కొట్టేసి.. బ‌య‌ట విక్రయించేవారు. అలా వ‌చ్చిన డ‌బ్బుతో అప్పులు తీర్చుతూ.. మిగ‌తా సొమ్ముతో జ‌ల్సాలు చేసేవారు. వారం రోజుల క్రితం హ‌బ్సిగూడ‌లో అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. త‌మ‌దైన స్ట‌యిల్ లో విచారించగా గుట్టు ర‌ట్టు అయ్యింది.

విక్కీరాజ్ పాత నేర‌స్తుడే
సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న విక్కీరాజ్ 2016 లోనే ఓ దొంగ‌త‌నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్లి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి.. ఇటీవ‌లే మ‌ళ్లీ దొంగ‌త‌నాలు చేయ‌టం మొద‌లుపెట్టాడు. 2018 జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌లో ప‌లు ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు చేశాడు విక్కీ. వీటిని డ‌బ్బుగా మార్చింది మాత్రం హీరో మ‌హ‌దేవ్ అలియాస్ మ‌హేష్. వీరి నుంచి రూ.15 ల‌క్ష‌ల విలువైన బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ సినిమాలో హీరోగా న‌టించి.. దొంగ‌గా మారిన ఓ క్రైం క‌థే ఇది..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.