44 నదులపై 39 డ్యామ్స్.. కేరళలో వరదలకు కారణం ఇదే

August 17, 2018

చుక్క నీరు వేస్ట్ చేయం.. ప్రతి ఎకరాన్ని తడిపేస్తాం.. భూముల్లో బంగారు పంటలు పండిస్తాం.. ప్రతి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ఇవే.. జలయజ్ణం అంటూ లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా నదులపై డ్యాములు లేస్తున్నాయి.. కాలువలు వచ్చేస్తున్నాయి. ఇదంతా రైతు కోసం అని గర్వంగా చెప్పుకుంటున్నాం.. కానీ.. ఇలాంటి డ్యామ్స్ ఎంత నష్టం చేస్తాయో కేరళ రాష్ట్రాన్ని చూస్తే తెలుస్తోంది. వందేళ్లు.. రెండు వందల ఏళ్లు అని కానీ.. కేరళ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున జల ప్రళయం రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది.. ఎందుకీ పరిస్థితి.. దీనికి కారణాలు ఏంటో చూద్దాం..

విచ్చలవిడిగా ప్రాజెక్టులు :
కేరళ రాష్ట్రంలో మొత్తం 44 నదులు ప్రవహిస్తుంటాయి. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల నుంచి దిగువకు ఉంటాయి. ఇదే కేరళకు అనుకూలం. దీనికి అవకాశంగా తీసుకుని.. 50 సంవత్సరాల్లోనే ఈ 44 నదులపై 39 డ్యాముల నిర్మాణం జరిగింది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు చేపట్టటంతో సహజసిద్ధమైన నీటి ప్రవాహానికి బ్రేక్ పడింది. ఆయా నదుల్లో నీటి ప్రవాహం.. చేపట్టిన డ్యామ్స్ లో వ్యత్యాసం ఉంది. అంటే.. అత్యధికంగా నీటి ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్ట్ నుంచి విడుదల అయ్యే నీరు తక్కువగా ఉండటం. ఇదే ఇప్పుడు కేరళలోని 14 జిల్లాలు నీటి ముంపునకు కారణం అవుతుంది. (ఉదాహరణ చూస్తే 2009లో కర్నూలు పట్టణం మునిగిపోవటానికి ఇలాంటి కారణమే).

2వేల మిల్లీమీటర్ల వర్షంపాతం :
కేరళలోని తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ వరకు ఉన్న 14 జిల్లాల్లో ఈ రెండు వారాల్లో 2వేల మిల్లీమీటర్ల వర్షపాతనం నమోదు అయ్యింది. మన దగ్గర 20 సెంటీమీటర్లు అంటేనే.. ఊరువాడా సముద్రాలను తలపిస్తాయి. అలాంటిది రెండు వేల మిల్లీమీటర్లు అంటే.. 200 సెంటీమీటర్లు. అంటే కుంభవ్రుష్టి. బిందెలోని నీళ్లను పారపోసే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో వర్షధార పడింది. ఇంతటి వానతో జల ప్రళయం వచ్చింది. ఇదే ప్రాంతంలో 1924లో 3,300 మిల్లీమీటర్ల వర్షపాతనం నమోదు అయ్యింది. అప్పట్లో డ్యామ్స్ లేవు.. దీంతో ఇంతటి విధ్వంసం జరగలేదు. కానీ అప్పటి వరకు ఇప్పుడు వెయ్యి 300 మిల్లీమీటర్లు తక్కువ వర్షపాతం నమోదు అయినా.. విధ్వంసం మాత్రం ఊహకందని విధంగా ఉంది. దీనికి కారణం పర్యావరణం.

ఆధునికత తెచ్చిన విధ్వంసం ఇది :
జనాభా పెరుగుదల, ఆధునికత తెచ్చిన విధ్వంసం ఇప్పుడు కేరళ అనుభవిస్తుంది. దేవుడి రాష్ట్రం ఇప్పుడు అదే దేవుడి ఆగ్రహానికి గురైంది. 20 సంవత్సరాల్లోనే అటవీ ప్రాంతాల్లో లెక్కలేనన్ని ప్రాజెక్టులు నిర్మించారు. కొండ ప్రాంతాల్లోనే ఆయా నదులపై 24 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. దీంతో అడవులను ఇష్టానుసారం నరికేశారు. ఉన్న ఊర్లకు ఖాళీ చేయించారు. వారికి పునరావాసం పేరుతో మరికొంత అటవీ ప్రాంతాన్ని నివాసయోగ్యాలు మార్చారు. ఆయా ప్రాజెక్టుల ప్రాంతాల్లో పర్యాటక అభివ్రుద్ది చేపట్టారు. దీంతో రహదారులు వచ్చాయి. వాగులు, వంకలపై చిన్నచిన్న వంతెనలు నిర్మించారు. భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహనం పెరిగి.. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీనికితోడు కొండల్లో నుంచి నీళ్లు కిందకు వచ్చే దారులు మూసుకుపోయాయి. ఈ నీళ్లే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లల్లోకి వచ్చేశాయి.

ఇసుక తవ్వకాలు కూడా కారణమే :
భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు విపరీతంగా పెరగటంతో నదుల్లోని ఇసుక మాయం అయ్యింది. పదేళ్లలోనే లక్షల కోట్ల విలువైన ఇసుక నదుల నుంచి తవ్వితీశారు. దీంతో నీటిని నిల్వచేసుకునే సామర్ధ్యాన్ని కోల్పోయాయి. నదిలో ప్రవాహవేగం పెరిగింది. నదుల్లో ఉండే సహజ వేగం కంటే.. రెట్టింపు స్పీడ్ తో నదుల్లో నీటి వేగం ఉంది. దీంతో నదీతీర ప్రాంతం కోతకు గురైంది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవటానికి, నదుల సమీపంలోని ఇళ్లు కూలిపోవటానికి ఇది కూడా ఓ కారణం.

మొత్తంగా చూస్తే 44 నదులపై చేపట్టిన 39 ప్రాజెక్టులే కేరళలో వరదలకు కారణం అని పర్యావరణ నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.