కంటి వెలుగు రివ్యూ : సారీ మమ్మీ, డాడీ.. కళ్లు తెరిపించారు

August 18, 2018

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. 3 కోట్ల 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంటింటికీ వచ్చి పేర్లు తీసుకుని.. టైం ఇచ్చి మరీ వెళుతున్నారు. పరీక్షలు చేస్తారు. కళ్లద్దాలు ఇస్తారు. శుక్లాలు తీయాలన్నా.. మరో ఆపరేషన్ అయినా పట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారు. రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు ఇదే ఎంతో మందిని ఆలోచింపజేస్తోంది. ప్రతి పల్లెకి చూపు వస్తోంది.. ఇదంతా ప్రభుత్వం చేస్తోంది.. మరి ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు.. పిల్లల ఆలోచన ఎలా ఉంది.. ఓ 40 ఏళ్ల వ్యక్తి ఫీలింగ్ అతని మాటల్లోనే..

సారీ మమ్మీ, డాడీ :
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. పేరు సంపత్. వయస్సు 40 ఏళ్లు. రెండు ఎకరాల భూమి ఉంది. సంపత్ కు ఓ అక్క, ఓ చెల్లి. నాలుగు ఎకరాల పొలంపై వచ్చే ఆదాయంతోనే పెళ్లిళ్లు చేసింది ఆ కుటుంబం. డిగ్రీ చదువుకున్న సంపత్.. హైదరాబాద్ వచ్చాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. పెద్ద జీతం కాకపోయినా నడుస్తోంది. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారు కూడా 5, 6 తరగతులు చదువుతున్నారు. ఎప్పుడో దసరా, దీపావళికి తప్పితే ఊరికి వెళ్లే పరిస్థితి లేదు. తండ్రికి ఏదైనా జబ్బు చేసినా.. కష్టం వచ్చినా చన్నీళ్లకు వేడినీళ్లుగా అప్పులు చేసి ఆదుకుంటున్నాడు. హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్ చదువులు, ఉద్యోగం టెన్షన్స్.. ఏదో నడిచిపోతుంది. రెండేళ్లుగా తండ్రి చూపు మందగించింది. కళ్లద్దాలు అయితే ఇప్పించాడు.. శుక్లాలు ఉన్నాయి ఆపరేషన్ చేయాలి అంటే.. ఖర్చుతో కూడుకున్నది. అంతే కాదు.. ఓ నాలుగు, ఐదు రోజులు సెలవు పెట్టాలి. కుదరటం లేదు. ఇటు ఫ్యామిలీ.. అటు పేరంట్స్. మధ్య నలిగిపోతున్నాడు.

కంటి వెలుగు పథకం తెలుసుకున్నాడు. అప్పుడు కానీ తండ్రి అనారోగ్యం, రెండేళ్ల క్రితం నాటి ఘటన గుర్తుకొచ్చింది. ఫోన్ చేశాడు తండ్రికి.. నాన్నా.. కంటి వెలుగు విన్నావా అని.. అవున్రా.. నిన్ననే పంచాయితీ సిబ్బంది వచ్చి చెప్పారు. ఆపరేషన్ కూడా ఫ్రీ అంట అన్నాడు. బిడ్డా.. నేను నీ బాధ అర్థం చేసుకున్నాను.. నేను కంటి వెలుగు కింద ఆపరేషన్ చేయించుకుంటాను.. చూసుకోవటానికి అమ్మ ఉంది కదా.. పైసలు కూడా ఇబ్బంది లేదు.. అంతా ఫ్రీ అంటున్నారు.. నీవ్వు చల్లగా ఉంటే చాలు బిడ్డా.. నా కంటి ఆపరేషన్ గురించి ఇక ఆలోచించమాకు.. రేపు దసరా పండక్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కళ్లారా చూస్తారా.. మసక పోయిద్ది.. అప్పటికి మంచిగా కనిపిస్తది.. ఉంటా బిడ్డా.. పిల్లలను అడిగానని చెప్పు అంటూ ఫోన్ కట్ అయ్యింది.

ఆ ఫోన్ తర్వాత సంపత్ కళ్లల్లో నీళ్లు. రెండేళ్ల నా బాధ ఇలా తీరింది. నేనే కాదు.. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం, కుటుంబంలో పడి తల్లిదండ్రుల అనారోగ్యం పట్టించుకోని వారు ఎందరో కదా.. కళ్లు సరిగ్గా కనిపిస్తేనే కదా.. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేది.. ఇంత పెద్ద విషయంలో చాలా చిన్నగా ఆలోచించినందుకు సిగ్గు పడుతున్నా అంటూ మనసులోనే సారీ మమ్మీ, డాడీ అనుకున్నాడు. ఇది ఒక్క సంపత్ విషయం మాత్రమే కాదు.. పట్నంలోని చాలా మంది బిడ్డల మనోవేదన.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం.. మరెందరో గుండెలను పిండేసింది…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.