డ్రంక్ అండ్ డ్రైవ్ : దొరికితే జైలుకే.. చితికిపోతున్న మనస్సులు

July 18, 2018

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఒక్కసారి దొరికితే నేరుగా జైలుకే. కౌంట్ లో సంబంధం లేకుండా అందరికీ జైలు జీవితం చూపిస్తున్నారు పోలీసులు. తెలంగాణలో శిక్షలు కఠినంగా ఎలా ఉంటాయో చెబుతున్నారు. మళ్లీ మందు ముట్టాలంటే చేతులు వణకాలి.. బార్ వైపు చూడాలంటే కళ్లకి జైలు జీవితం గుర్తు రావాలి.. మందు తాగాలన్న ఆలోచన వస్తే చాలు జైలు గుర్తుకు రావాలంటోంది ప్రభుత్వం. ఇటీవల కాలంలో వీకెండ్ వస్తే చాలు ఇలాంటి చర్చలే ఎక్కువగా నడుస్తున్నాయి. మందు పార్టీలకు డుమ్మా కొట్టే ఫ్రెండ్ ఎక్కువ అయ్యారని.. ఐటీ ఉద్యోగులు స్వయంగా చెప్పుకుంటున్నారు. దీనికి కారణం జైలు శిక్షలు. ఇటీవల వేల మంది జైలు జీవితం అనుభవిస్తే.. అందులో 30శాతం మంది ఐటీ రంగం, అనుసంభ రంగాల్లో పని చేస్తున్న వారే కావటం విశేషం.

అందరూ మధ్య తరగతి వాళ్లే.. ఉద్యోగాలు చేసుకుంటూ, చదువుకుంటూ ఉన్న కుర్రోళ్లే ఉంటున్నారు. వీరి మాటల్లోనే విందాం…

నేను GRE చదువుకుంటున్నా.. ప్రిపేర్ అవుతున్నా. 10 రోజుల్లో ఎగ్జామ్. ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తే పార్టీ చేసుకున్నాం. ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి వస్తున్నా. రాత్రి 11 గంటలకు దొరికా. రీడింగ్ 80 చూపించింది. ఇంటర్నెట్ మొత్తం వెతికా.. 90 దాటితేనే జైలు అని వచ్చింది. హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యా. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. కౌన్సెలింగ్ కోసం పేరంట్స్ మాత్రమే రావాలంటూ పోలీసులు పట్టుబడుతున్నారు. బ్రదర్ అయినా ఉండాలంటున్నారు. విధి లేక ఎక్కడో ఉన్న అన్నను రప్పించా. ఓ రోజంతా అయిపోయింది. ఆ తర్వాత నాలుగు రోజుల జైలు పడింది. జరిమానా విధిస్తారు అంటూ పోలీసులు చెప్పారు. అలా జరగలేదు. జైలు జీవితం ఊహించలేదు. అదో పీడ కల. నరకం. – ఓ GRE స్టూడెంట్.

నేను ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్లా. భయంగానే ఉంది. ఒక్క బీరుకు ఏం కాదు.. రీడింగ్ కూడా 38లోపే వస్తుంది.. భయపడాల్సిన అవసరం లేదు.. వదిలేస్తారు అని చెప్పారు. ఫ్రెండ్స్ అంత గట్టిగా చెప్పినప్పుడు ఏముందని నిజంగా ఒక్క లైట్ బీరు (KF ప్రీమియం) తాగాను. బారు బయటకు రాగానే పట్టుకున్నారు. రీడింగ్ 37 వచ్చింది. బుక్ చేశారు. కౌన్సెలింగ్ కోసం ఫ్యామిలీని తీసుకెళ్లాలి కదా.. ఇంట్లో తెలిసింది. పెద్ద రాద్దాంతం. ఆ తర్వాత జైలుకి వెళ్లారు. రెండు రోజులు ఉన్నా. బీరు 100 రూపాయలు.. మూడు రోజుల నరకం. ఛీ దీనమ్మ జీవితం.. ఆఫీస్ మొత్తం అదే పెద్ద నేరంగా చూస్తున్నారు.. ఇంట్లో కూడా విలువ లేకుండా చూస్తున్నారు.. వెంటనే బెంగళూరు షిఫ్ట్ అవుదామని డిసైడ్ అయ్యా – ఐటీ ఉద్యోగి, హైటెక్ సిటీ

వీరిద్దరి మనేవేదన కాదు ఇది.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి.. జైలుకి వెళ్లొచ్చిన వారి అందరి అనుభవం ఇది. కాకపోతే ఇక్కడే ఓ చిక్కు. అందరికీ న్యాయం ఒకే రకంగా ఉండటం లేదు.. 100 దాటినా ఓ సెలబ్రిటీ జైలుకి మాత్రం వెళ్లలేదు కదా..37 వచ్చినోడు జైలుకి వెళ్లొచ్చాడు.. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ నీతి అనేది మనస్సు చివుక్కు అంటోంది. ఇలాంటి వివక్ష మనస్సుని మరింత ఆందోళన, అసహనానికి గురి చేస్తోంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.