72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తెలుసుకోవాల్సిన ఇండియా

August 12, 2018

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు. ఎర్రకోటలో ఘనంగా వేడుక చేసుకోబోతున్నాం. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ గుండెలపై త్రివర్ణ పతాక చిహ్నంతో గర్వంగా ఉప్పొంగిపోతాం. వాడవాడలా వేడుకలు అదిరిపోతాయి. జెండా ఎగరేస్తాం.. స్వీట్లు పంచుతాం.. చాకెట్లు ఇస్తాం.. ఇలా దేశానికే ఓ పండుగ. మరి మన దేశం గురించి మీరు తెలుసుకోవాల్సిన.. చరిత్రలోని కొన్ని నిజాలు ఇలా ఉన్నాయి.

సగం జీతం మాత్రమే తీసుకున్న రాష్ట్రపతి :
మన దేశానికి మొట్ట మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1950 నుంచి 12 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉన్నారు. అన్ని సంవత్సరాలు రాష్ట్రపతిగా చేసిన ఏకైక వ్యక్తి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జీతం 10 వేల రూపాయలు మాత్రమే. ఆయన మాత్రం కేవలం 5వేల రూపాయలు మాత్రమే జీతంగా తీసుకునేవారు. మిగతా 5వేలు దేశానికి ఇచ్చేశారు.

రెండు దేశాలకు జాతీయ గీతం రాసిన ఠాగూర్ :
మన దేశానికి జాతీయ గీతాన్ని అందించించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన సాహిత్య రచన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మన రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశానికే కాకుండా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రాసింది ఆయనే కావడం విశేషం. రెండు దేశాలకు జాతీయ గీతం రాసిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి మన రవీంద్రనాధ్ ఠాగూర్. గర్వంగా ఉంది కదూ..

అంతరిక్షం ఛేదించిన రాకేష్ శర్మ :
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్. అప్పటి ప్రధాన మంత్రి అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా ఉంది అని ప్రశ్నించగా.. సారే జహాసే అచ్చా హిందూస్తా హమారా అంటూ దేశభక్తిని చాటిన వ్యక్తి రాకేష్ శర్మ.

వజ్రాలకే పుట్టినిల్లు మన దేశం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ప్రవహించే కృష్ణానది ఒడ్డున మొదటగా వజ్రాలు బయటపడ్డాయి. ఒక్కప్పుడు వజ్రాల సంపద అనేది ఒక్క మన దేశంలో మాత్రమే ఉండేది. 18వ శతాబ్దంలో బ్రెజిల్ లో కూడా వజ్రాలను గుర్తించారు.

అబ్దుల్ కలాంకి స్విట్జర్లాండ్ లో అరుదైన గుర్తింపు :
భారతదేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించిన గొప్ప ఏ.పి.జె.అబ్దుల్ కలాం. ఆయన 2006వ సంవత్సరంలో స్విట్జర్లాండ్ దేశంలో పర్యటించారు. ఆయన రాకని పురస్కరించుకుని.. ఆయన సింప్లిసిటీ, ఆయన ప్రసంగానికి మంత్రముగ్దులు అయిన స్విట్జర్లాండ్ ప్రజలు.. మే 26వ తేదీని సైన్స్ డేగా ప్రకటించారు. స్వట్జర్లాండ్ లో అబ్దుల్ కలాం పర్యటించిన తేదీ అది.

సైకిల్ పై నుంచి ఆకాశంలోకి రాకెట్ :
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న తుంబ లాంచింగ్ స్టేషన్ కి మొదటి రాకెట్ ని సైకిల్ పై తీసుకెళ్లారు. ఆ మొదటి రాకెట్ చాలా చిన్నగా ఉండటమే కాకుండా బరువు కూడా చాలా తక్కువ. ఇప్పటి రాకెట్లతో పోల్చితే అది అంత చిన్నగా ఉండేది. సైకిల్ పై తీసుకెళ్లారంటేనే తెలుస్తుంది దాని సైజు.. బరువు కదా..

చందమామపై నీటి జాడలు చెప్పాం :
సెప్టెంబరు 2009. భారత చరిత్రను మార్చిన రోజు. ఇస్రో చంద్రయాన్ -1 చంద్రునిపై మొదటిసారిగా నీటిని గుర్తించింది. నాసానే విషయం తెలిసి నోరెళ్లబెట్టింది. భారత పరిశోధనలపై అప్పటి నుంచే సానా ప్రత్యేక దృష్టి పెట్టింది.

చక్కెరకు పాలిష్ చేయటం నేర్పించాం :
చక్కెరను వెలికితీసే.. శుభ్రపరిచే సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేసింది మన దేశమే. ఆ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఈ సాంకేతిక పద్ధతులను నేర్చుకుని.. వారి దేశాలకు వెళ్లి అమలు చేశారు.

శాఖాహారుల్లో నెంబర్ వన్ :
ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. 40శాతం మంది పూర్తిగా శాఖాహారులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో అప్పుడప్పుడూ తినేవారు తయారు అయ్యారు.

ఇంగ్లీష్ భాషలోనూ మనమే టాప్ :
ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ భాష ఎక్కువగా మాట్లాడే వారి సంఖ్యలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. జనాభా పరంగానూ ఇది సాధ్యం అయ్యింది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.