హైదరాబాద్ పోలీస్ సింగం.. కమిషనర్ అంజనీ కమార్

August 12, 2018

బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు – సిటీపై ప్రత్యేక ముద్ర
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. బాధ్యతలు స్వీకరించి సరిగ్గా ఆరు నెలలు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. గతంలో ఏ కమిషనర్ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. మానవత్వానికి టెక్నాలజీ జోడించి చేస్తున్న పనితీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. పోలీస్ శాఖలో పనితీరు మార్చుకోండి అని పదేపదే చెప్పకుండా.. చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ సుతిమెత్తంగా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఏ కంపెనీ అయినా ఉద్యోగులను ఫ్యామిలీ.. ఫ్యామిలీ అంటూ ఓన్ చేసుకోవటం చూశాం.. కానీ పోలీస్ శాఖలో అలాంటి శైలిని మొట్టమొదట తీసుకొచ్చి.. తనదైన గుర్తింపు తెచ్చారు అంజనీకుమార్. తన పనితీరుతో ఎంత డిఫరెంటో చెబుతున్నారు. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాం..

సిటీలో పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చిన ఓ కంప్లయింట్ ఆధారంగా రాత్రి 11 గంటల సమయంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా విజిట్ చేశారు. రౌడీషీట్ చూశారు. ఎంత మంది బయట ఉన్నారు.. ఎంత మంది లోపల ఉన్నారో లెక్కలు సరిచేశారు. రికార్డ్స్ వరకే పరిమితం కాలేదు.. స్టేషన్ మొత్తాన్ని అనువణువు పరిశీలించారు. నీట్ గా పెట్టుకోవాలని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు స్టేషన్ ఇన్ ఛార్జ్ లకు. మరికొన్ని రోజులకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో స్టేషన్ లో కానిస్టేబుల్స్ మినహా అధికారి స్థాయిలో ఎవరూ అందుబాటులో లేరు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. వివరణ కోరారు. పోలీస్ కమిషనర్ ఎప్పుడు వస్తారో అన్న భయంతో.. అప్పటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఓ అధికారి నిరంతరం అందుబాటులో ఉంటున్నారు.

అందరూ ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తారు.. ఎవరికి వారే యమునా తీరే. దీన్ని మార్చాలని భావించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఆత్మీయ సమ్మేళనం అనే ప్రోగ్రాంకి తెరతీశారు. కమిషనర్ స్వయంగా వారానికో పోలీస్ స్టేషన్ కు వెళుతున్నారు. ఆ స్టేషన్ లోని సిబ్బంది కుటుంబ సభ్యులు అందరూ దీనికి హాజరవుతున్నారు. పోలీస్ కుటుంబాలకు విధులు ఎలా ఉంటాయి.. కేసులు ఎలా పరిశోధిస్తారు.. ఆయుధాలు ఏంటీ అని వివరిస్తున్నారు. పోలీస్ బాధ్యతలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. వారి పిల్లలతో కమిషనర్ స్వయంగా మాట్లాడుతున్నారు. ఏం చదువుతున్నారు.. వారి లక్ష్యాలు ఏంటీ అని అడిగి తెలుసుకుంటున్నారు. ఒకరికి ఒకరిని పరిచయం చేయిస్తున్నారు. మనం అంతా ఓ ఫ్యామిలీ అనే భావన కల్పిస్తున్నారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి చెబుతున్నారు.

ఆత్మీయ సమ్మేళనం మాత్రమే కాదు.. తప్పులు జరిగితే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అంజనీకుమార్. ఇందుకు ఇటీవల వాట్సాప్ వాయిస్ మెసేజ్ అందుకు నిదర్శనం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మహిళను.. సిబ్బంది ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఔట్ పోస్ట్ లో ఆ మహిళపై రేప్ జరిగింది. ఇందులో హోంగార్డ్ కూడా ఉన్నాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వ్యవహరించిన తీరు వల్లే చెడ్డపేరు వచ్చింది.. పద్దతి మార్చుకోవాలని వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సివిల్ వివాదంలో తలదూర్చిన చిలకలగూడ పోలీసులు.. ఓ దంపతులను ప్రైవేట్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. భార్య ముందే భర్తను లాకప్ లో వేసి.. ఆమె ఎదుటే కొట్టారు. అడ్డుకోబోయిన ఆమెపైనా మహిళా కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించింది. అరగంట పాటు స్టేషన్ లో నిర్భందించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ తర్వాత రాత్రి 9.30గంటల సమయంలో సీపీని కలిసి జరిగిన విషయాన్ని వివరించింది ఆ ఫ్యామిలీ. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాం.. ఇలా చేస్తారని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. దీనిపై స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్.. విచారణకు ఆదేశించారు. బాధ్యుడు అయిన ఎస్సై రాజేష్ ను సస్పెండ్ చేశారు. దీనిపై వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేసి.. అందరికీ తెలిసేలా అలర్ట్ చేశారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తున్నది పని చేయటానిక అని.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండటం అంటే ఇది కాదని చురకలు అంటించారు.

ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు పట్టపగలు.. పోలీస్ వాహనంలో మద్యం తరలించటానికి తీవ్రంగా పరిగణించారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలకు ఆదేశించారు. పరువు తీయొద్దని మెసేజ్ చేశారు. ఇలాంటివి రిపీట్ చేయొద్దని.. జరిగితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

సిటీ అర్థరాత్రి ఏం జరుగుతుంది.. ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది.. ఈ అనుభవాన్ని కూడా ప్రత్యేక్షంగా అనుభవించారు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. పాతబస్తీలో నైట్ వాక్ చేశారు. సుమారు మూడు కిలోమీటర్లు నడిచారు. రెడ్ టీ షర్ట్ వేసుకుని సాధారణ వ్యక్తిలా నడుచుకుంటూ అన్ని పరిశీలించారు. గన్ మెన్లు కూడా 100 మీటర్ల వెనకే ఉన్నారు. వారు కూడా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. ఓల్డ్ సిటీలో సమస్యాత్మక ప్రాంతాలు రాత్రి వేళల్లో ఎలా ఉంటాయో చూశారు. రోడ్డు పక్కన ఫ్రూట్స్ బండి దగ్గర ఆగి.. వాటి ధరలు అడిగి తెలుసుకున్నారు.

మార్చి 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.. ఆగస్ట్ 12వ తేదీకి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలోనే సిటీపై తనదైన ముద్ర వేశారు. డిపార్ట్ మెంట్ పరంగానూ ఫ్రెండ్లీ పోలిసింగ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఆత్మీయ సమ్మేళనంతో సిబ్బందిలోనూ మార్పుకి ప్రయత్నించారు. కఠిన చర్యలు తీసుకుంటూ హెచ్చరికలూ ఇచ్చారు. మొత్తానికి సిటీపై తనదైన ముద్ర వేస్తూ ఆ విధంగా ముందుకు సాగుతుంది ఈ పోలీస్ సింహం..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.