ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కారణాలు ఇవే!

August 14, 2018

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల జరగబోతున్నాయా.. ఎందుకు ముందుగా ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.. ఆరు నెలల ముందే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాలని ఆలోచిస్తోంది.. పార్లమెంట్ తోపాటు ఎన్నికలకు వెళ్లటానికి ఎందుకు ఆసక్తి చూపించటం లేదు.. ఈ విషయాలపై తుగ్లస్ టైమ్స్ కు అందిన పార్టీ రిపోర్ట్ ఇలా ఉంది..

ముందస్తుకు ఉన్న ఐదు కారణాలు ఇలా ఉన్నాయి :

  1. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. మిషన్ కాకతీయతో ఇంటింటికీ నీళ్లు వస్తున్నాయి. రైతు రుణమాఫీతోపాటు ఇటీవలే ప్రారంభించిన రైతు బంధుకి రైతులు అందరూ హ్యాపీగా ఉన్నాయి. రూ.5లక్షల రైతు బీమా పల్లెల్లో సానుకూలత వ్యక్తం అవుతున్నది. అక్టోబర్, నవంబర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లయితే.. అదే సమయానికి రైతు బంధు రెండో చెక్కు కూడా రైతులు అందుకుంటారు. భారీ వర్షాలతో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. పంటలు బాగా పండుతున్నాయి.
  2. కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేకత అనే ఒక్క పాయింట్ చూపించి జనంలోకి వెళుతుంది. వారికి ఆశించిన స్థాయిలో జనం నుంచి స్పందన లేదు. ప్రతిక్షాలు అన్నీ కూడా ఒకేతాటిపై రాలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లయితే.. ఒక్కటి కావటానికి సమయం కూడా ఉండదు. కాంగ్రెస్ లోని సీనియర్స్ లో అప్పుడే సీఎం పీఠంపై ఎవరికి వారు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఆ పార్టీ మైనస్ గా మారింది. ఇక నుంచి రాహుల్ నెలలో రెండు రోజులు తెలంగాణకి కేటాయిస్తారు అని ప్రకటించింది కాంగ్రెస్. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా.. ముందస్తుకి వెళ్లినట్లయితే కాంగ్రెస్ సర్దుబాటులతోనే టైం సరిపోతుంది.
  3. కేంద్రం – రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే క్రాస్ ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం – కేంద్రం మధ్య ఓట్ల చీలికకు అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో గెలవలేం అనుకున్నప్పుడు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసే అవకాశం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ కు వేయండి అని చెప్పే అవకాశాలూ లేకపోలేదు. గందరగోళం సృష్టించి.. ఓట్లను తన వైపు తిప్పుకునే అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వకూడదు అనేది కూడా సీఎం కేసీఆర్ ముందస్తు వ్యూహంలో ఓ భాగం.
  4. కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇది రాష్ట్రంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ జతకట్టలేని పరిస్థితి.. అలా అని బీజేపీని పూర్తిగా పక్కనబెట్టాలన్నా కష్టం. మోడీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వెళ్లటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్.. 2019 కాకపోయినా.. ఆ తర్వాత అయినా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అదే రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు జరిగితే.. టీఆర్ఎస్ పూర్తిగా మెజార్టీ సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగితే.. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం కూడా ఈజీ. ముందస్తు ఎన్నికల ద్వారా ప్రస్తుతం ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర ఎన్నికలపైనే దృష్టి పెడతారు.. ప్రచారం మరింత ఊపు మీద ఉంటుంది. ఇది టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం.
  5. సీమాంధ్ర ఓట్లపైనా టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఏపీలో బీజేపీ నానాటికీ తీసికట్టుగా మారింది. ఒకేసారి ఎన్నికలకు వెళితే.. తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగే స్థాయిలో ఉన్న సీమాంధ్రులు.. మోడీ, బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ – టీడీపీ లోపాయికారీ ఒప్పందం వల్ల కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే తెలంగాణలో ముందుగానే ఎన్నికలకు వెళ్లటం మంచిది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎన్నికలు జరుగుతుండటంతో.. అందరి ఫోకస్ టీఆర్ఎస్, అభివృద్ధిపైనే ఉంటుంది.. మోడీ, బీజేపీపై ఫోకస్ ఉంటుంది. ఇది టీఆర్ఎస్ కు లాభిస్తోంది. తెలంగాణలోని సీమాంద్రులకు కూడా హోదా అంశం అప్రస్తుతంగా ఉంటుంది. దీంతో వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ వైపు వెళతారు.

ఈ ఐదు కారణాలతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్రంలోని బీజేపీ దగ్గర కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. నవంబర్, డిసెంబర్ లో దేశవ్యాప్తంగా జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతోనే తెలంగాణలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.