కాంగ్రెస్ హామీ సాధ్యమేనా : మహిళా సంఘాలకు లక్ష గ్రాంట్.. రూ.10లక్షల లోన్

August 13, 2018

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ భారీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని 6 లక్షల మహిళా సంఘాలకు ఊహించని ఆఫర్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఒక్కో మహిళా సంఘానికి లక్ష రూపాయల గ్రాంట్ ప్రకటించింది. అదే విధంగా ఒక్కో మహిళా పొదుపు సంఘానికి బ్యాంక్ నుంచి రూ.10లక్షల అప్పు ఇప్పిస్తామని వెల్లడించింది. అంతేకాదు.. రూ.10లక్షల అప్పునకు కట్టాల్సిన వడ్డీపైనా రాయితీ ఇస్తాం అని.. అది 2వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని.. ఇదంతా మహిళల సొమ్మే అంటూ రాహుల్ సమక్షంలోనే భారీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
అంతేకాదు రాష్ట్రంలోని 6లక్షల మహిళా సంఘాలకు ఇన్సూరెన్స్ ఇస్తాం.. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఘాల్లోని ప్రతి మహిళకు రూ.5లక్షల వరకు యాక్సిడెంట్ పాలసీ కల్పిస్తామని కూడా ప్రకటించారు. దీనికి ప్రీమియం చెల్లించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. బీమా మిత్రులు, విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్లకు నెలకు రూ.750 జీతం ఇస్తామంటోంది కాంగ్రెస్. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న సర్ఫ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని వరం ఇచ్చింది. అభయహస్తం పథకం పున:రుద్దరిస్తామని.. పెన్షన్ మొత్తాన్ని కూడా వెయ్యి రూపాయలకు పెంచనున్నట్లు రాహుల్ సమక్షంలోనే ప్రకటించింది కాంగ్రెస్.
మహిళా సంఘాలపై కాంగ్రెస్ ఈ రేంజ్ లో వరాలు కురిపించటం ఆసక్తి రేపుతోంది. ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. 6 లక్షల గ్రూపులకు.. లక్ష చొప్పున గ్రాంట్ అంటే అక్కడే రూ.600 కోట్లు అవుతుంది. అదేవిధంగా ఒక్కో సంఘానికి 10లక్షల రుణం అంటే 6వేల కోట్ల రూపాయలు అవుతుంది. వడ్డీ రాయితీ, సెర్ఫ్ ఉద్యోగుల పర్మినెంట్ అన్నీ లెక్కలు వేసుకుంటే.. అసలు ఇదిసాధ్యమేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మహిళా సంఘాల వరకే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తే రాష్ట్ర బడ్జెట్ లో 10శాతం ఉంటుంది. రాబడి, ఖర్చులు అంచనా వేస్తే ఇంత పెద్ద హామీ ఎలా నెరవేరుస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.