మోడీపై వ్యతిరేకత టీఆర్ఎస్ కు నష్టమా?

September 3, 2018

త్వరలోనే రాజకీయ ప్రకటన రావొచ్చు అంటూ ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్.. వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లటానికి కారణాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ముందస్తు ఎన్నికలపై అవును – కాదు అని చెప్పకుండా త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుందని చెప్పటం చూస్తుంటే.. పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నం అయినట్లు స్పష్టం అవుతుంది. షెడ్యూల్ ప్రకారం కాకుండా.. ఆరు నెలల ముందే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే తెలంగాణలోనూ పోలింగ్ యుద్ధానికి వెళ్లటం వెనక కారణాలను ఈ విధంగా చెబుతున్నారు నిపుణులు.

  1. రాష్ట్రంలో 465 సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల లబ్ధితో ప్రజలు మేలు జరుగుతుంది. కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా, సంవృద్ధిగా తాగు, సాగు నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్స్, గురుకులాలు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలతోపాటు ఆసరా కల్పిస్తున్నాయి. వీటిపై ఎలాంటి వ్యతిరేకత లేదు.
  2. ప్రభుత్వ పథకాలతో ప్రజలు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ పథకాలు పాతవిగా కనిపిస్తూ.. కొత్త వాటి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం ఇవనటువంటి ఆర్థిక ప్రయోజనాలు వ్యక్తిగతంగా కల్పిస్తున్నారు. ఇంకా ఇవ్వాలి అంటే కష్టం. ఆర్థిక పరిస్థితిపై భారం. అప్పటి వరకు వెయిట్ చేసే.. అప్పుడు కూడా ఇవే పథకాలను ప్రకటించటం, ప్రస్తావించటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది.
  3. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో డిసెంబర్లో ఎన్నికలు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే.. మోడీకి వ్యతిరేకత మరింత పెరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ నిర్వహిస్తే.. మోడీపై వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇది టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదు. క్రాస్ జరిగినా ఆశ్చర్యం లేదు.
  4. ఇటీవల జాతీయ పత్రికలు, ఛానల్స్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పుంజుకుంటుందని స్పష్టం అయ్యింది. బీజేపీ 100 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని సంకేతాలు వచ్చాయి. అదే విధంగా 2014లో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కేవలం 13శాతం మాత్రమే రాహుల్ గాంధీ పేరు చెప్పారు. 2018 నాటికి ఈ శాతం గణనీయంగా పెరిగి 46శాతం వరకు వచ్చింది. అంటే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అనూహ్యంగా పుంజుకుంటుదనే సంకేతాలు వచ్చాయి.
  5. లోక్ సభతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల సీమాంధ్ర ఓటర్లు మోడీపై కోపంతో.. కాంగ్రెస్ వైపు వెళ్లినా.. బీజేపీపై కోపంతో ముస్లింలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ విస్మరించటం లేదు.
  6. మే నెల అనగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి.. సహజంగానే మంచినీటి, సాగునీటి ఇబ్బందులు ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వాలనేది టీఆర్ఎస్ పార్టీ ఆలోచన

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా.. అంటే డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.