10వ తరగతి పిల్లోడు.. ఫ్రెండ్స్ కు రూ.46 లక్షల బహుమతులు ఇచ్చాడు

August 13, 2018

వయస్సు 15 ఏళ్లు.. పదో తరగతి చదువుతున్నాడు.. బాగా యాక్టివ్ ఈ కుర్రోడు.. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు.. చదువు కంటే తిరుగుళ్లపైనే దృష్టి పెట్టాడు.. ఈ వయస్సులో కామన్ అనుకున్న పేరంట్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.. ఇంట్లో డబ్బు కనిపిస్తే ఎత్తుకెళ్లటమే.. వంద, 200 కావటంతో లైట్ తీసుకున్నారు పేరంట్స్.. ఇప్పుడు అదే అలవాటు వారికి రోడ్డుపైకి తీసుకొచ్చింది.. నిలువుదోపిడీకి కారణం అయ్యింది. పోలీసులు, సమాజం మొత్తం షాక్ అయిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓ డీల్ చేశాడు. 60లక్షలు చేతికి వచ్చాయి. మొత్తం డబ్బును ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో పెట్టాడు. అప్పటికే చేతివాటం ఉన్న 10వ తరగతి చదువుతున్న కుమారుడి కంట్లో పడ్డాయి ఆ డబ్బులు. అంతే అక్షరాల రూ.46 లక్షల రూపాయలు లేపేశాడు. మొత్తం డబ్బును ఫ్రెండ్ షిప్ డే రోజున.. ఫ్రెండ్స్ కోసం ఖర్చు చేశాడు. తన క్లాస్ లో ఉన్న 35 మందికి బహుమతులు ఇచ్చాడు. తన హోంవర్క్ చేసి పెట్టిన ఓ ఫ్రెండ్ కు రూ.3లక్షలు ఇచ్చాడు. తనతో ఎప్పుడూ క్లోజ్ గా ఉండే మరో ఫ్రెండ్ కు రూ.15 లక్షలు ఇచ్చాడు. ఆ 15లక్షలతో కారు కొనిచ్చాడు. మరో 20 మంది ఫ్రెండ్స్ కు స్మార్ట్ ఫోన్లు, గోల్డ్, సిల్వర్ బ్రాస్ లెట్స్ కొనిపెడ్డాడు. 30, 40వేల రూపాయల విలువైన వాచీలు గిఫ్ట్ గా ఇచ్చాడు.
అంతటితో ఆగలేదు. తను ట్యూషన్ కు వెళ్లే కోచింగ్ సెంటర్ లోని ఫ్రెండ్స్ కు కూడా ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ అంటూ స్మార్ట్ ఫోన్లు, వాచీలు ఇచ్చాడు. మొత్తం 46లక్షల రూపాయల డబ్బును పంచేశాడు. ఇంట్లో మాత్రం ఏమీ తెలియనట్లు నటించేశాడు. 60లక్షల రూపాయల్లో కొందరికి డబ్బులు ఇవ్వాల్సి ఉండి.. బ్యాగ్ ఓపెన్ చేసిన తండ్రి షాక్ అయ్యాడు. అందులో డబ్బు లేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూ టీమ్స్ రంగంలోకి దిగాయి. అయినా ప్రయోజనం లేదు. దోపిడీ జరిగిన ఆనవాళ్లు లేవు.. దొంగలు వచ్చిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఇంట్లోవారిపైనా వారికి అనుమానం రాలేదు. ఇలా నాలుగు రోజులు గడిచిపోయాయి. పోలీసులకు సవాల్ గా మారింది కేసు. తండ్రి సైతం కుమారుడిపై అనుమానం వ్యక్తం చేయకపోగా.. కనీసం ప్రశ్నించనూ లేదు.
చివరగా పోలీసులు కుమారుడి ఫ్రెండ్స్ ప్రశ్నించారు. అంతే షాకింగ్. ఒక్కొక్కరి దగ్గర కొత్త స్మార్ట్ ఫోన్లు, బంగారం, వెండి బ్రాస్ లెట్స్ వచ్చాయి. ఎక్కడివి అని ప్రశ్నిస్తే.. ఫలానా ఫ్రెండ్ కొనిచ్చాడు.. అందరికీ ఇచ్చాడు అని తెలిపారు. పోలీసులు – పేరంట్స్ మీటింగ్ పెట్టాడు. ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు.. ఎంత డబ్బు ఇచ్చాడో లిస్ట్ తయారు చేసి స్కూల్ ప్రిన్సిపాల్ కు అందజేశారు. అక్కడి నుంచి అడ్రస్ లు పట్టుకుని పేరంట్స్ అందరికీ కబురు చేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు 15 లక్షలు రికవరీ అయ్యాయి. మిగతా వారు తిరిగి ఇవ్వటానికి వారం రోజుల సమయం ఇచ్చారు. అందరూ మైనర్లు కావటంతో పేర్లు వెల్లడించటానికి ఇష్టపడలేదు పోలీసులు. వారిపై ఇప్పటి వరకు కేసులు కూడా నమోదు చేయలేదు. కొంత డబ్బు మాత్రం రెస్టారెంట్లలో ఖర్చయిపోయింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెండ్ షిప్ డేగా మిగిలిపోయింది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.