సీఎం కేసీఆర్ వరాల జల్లు : హుజూర్ నగర్ కు రూ.25 కోట్లు

October 26, 2019

హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం (అక్టోబర్ 26, 2019) హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు.

నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏడు మండల కేంద్రాల్లో ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూర్ నగర్ లో బంజారా భవన్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ ను వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

హుజూర్ నగర్ లో ఈఎస్ ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ, కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 3 వేల గిరిజన తండాలు, పెంటలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. మీ అందరి దీవెనలతోనే సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. గెలిపించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. నీళ్లేవో, పాళ్లేవో బల్ల గుద్ది ప్రజలు మరీ చెప్పారని తెలిపారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.