వాదం వన్ సైడ్ : ఎవరు ద్రోహి.. ఎందుకు ద్రోహులు

July 18, 2018

60 ఏళ్ల రాష్ట్ర కల సాకారం అయ్యింది.. మన రాష్ట్రం – మన పాలన.. ఇప్పుడు ఒకటి లక్ష్యం.. అది అభివృద్ధి. ఇప్పుడు ముందుకెళ్లాల్సింది కూడా ఆ దిశగానే.. అడుగులు పడాల్సింది కూడా ఆ వైపే. నాలుగేళ్లు స్వయం పాలనలో.. సాధించినవి ఎన్నో.. సాధించాల్సినవి ఇంకెన్నో. ఇక్కడే ఓ వాదం వన్ సైడ్ గా వస్తోంది.. ఉమ్మడి ఆంధ్రలో కూడా వినిపించని మాటలు.. కనిపించని వింతలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ద్రోహి అనే మాటలను తరచూ వింటున్నాం. కాకపోతే ఈ మాటలు అంటున్నది కూడా తెలంగాణ వారే కావటం విడ్డూరం. ఎవరు ద్రోహి.. ఎందుకు ద్రోహి అవుతారో అర్థం కావటం లేదు సామాన్యులకు.

ఒక లక్ష్యం కోసం పోరాటం చేసేటప్పుడు.. ఇంట్లో ఓ శుభకార్యం చేసేటప్పుడు ఎప్పుడైనా కచ్చితంగా భిన్న వాదనలు వినిపిస్తాయి. లక్ష్యం ఒకటే కావొచ్చు.. వాదనలు వేర్వేరుగా ఉంటాయి. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీ ఓ సారి కాంగ్రెస్, మరోసారి టీడీపీతో జత కట్టింది. అంటే టీఆర్ఎస్ కూడా తెలంగాణ ద్రోహి పార్టీనా.. అలాంటప్పడు సీఎం కేసీఆర్ ను ఏం అనాలి. అది సరే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హర్షకుమార్ బహిరంగంగానే తెలంగాణకు మద్దతు ప్రకటించారు. ఆయన ఆంధ్ర ద్రోహి అయ్యారా. ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ నా వల్లే వచ్చింది అని అంటారు.. ఆయన ఆంధ్రకు సీఎం కాలేదా.. ఇక్కడ ఓ విషయం గమనించాల్సిన అంశం కచ్చితంగా ఒకటి ఉంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు.. సీఎం కేసీఆర్ అప్పుడే ఓ మాట చెప్పారు. ఇక నుంచి ఫక్త్ రాజకీయం చేస్తాం.. టీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి రాజకీయ పార్టీగా మాత్రమే ఉంటుంది. అప్పట్లో ఆహ్వానించిన ప్రజలు.. అధికారం ఇచ్చారు. ప్రజల ఆశలు, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారా లేదా అనేది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు.. లేకపోతే లేదు. అధికార పార్టీ ఎవరు చేసినా తెలంగాణ ద్రోహి అంటే.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే శక్తి, అధికారం ఉండి కూడా వెయ్యి మంది యువకుల ప్రాణాలు పోయిన తర్వాత కానీ కళ్లు తెరవని కాంగ్రెస్ పార్టీ వైఖరిలో తప్పులేదా.. లక్ష్యం సాధనలో విభిన్న వాదనలు ఉండొచ్చు.. రాష్ట్రం వచ్చేసింది.. అందరూ తెలంగాణ బిడ్డలే.. ఇప్పుడు కూడా వాదనలు ఉంటాయి.. పార్టీలూ ఉంటాయి.. కానీ గతించిన ఉద్యమ విద్వేషాలపైనే రాజకీయం చేస్తామంటే వినటానికి.. చూడ్డానికి ప్రజలు ఇంకా 1G, 2G, 3G కాలంలో లేరు కదా..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.