లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్.. కసి, కన్నీళ్లు..

March 29, 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎలా ఉన్నా.. కుటుంబ పరంగా నందమూరి వంశానికి ఈ సినిమా కంటగింపుగానే ఉంది. 24 ఏళ్ల క్రితం జరిగిన ఓ యథార్థ కథ.. ఇప్పటికీ కథగానే ఉంది. దీన్ని అసలు కథగా తెరకెక్కించిన వర్మపై నమ్మకమో లేక మా కుటుంబంలో అప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే ఉత్సుకతో ఏమోగానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ప్రత్యేకంగా చూశారు. నాన్న, పెదనాన్న, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మామలు అసలు ఏం చేశారు.. అప్పుడు కుటుంబంలో ఏం జరిగింది అనేది కళ్లార తెర చూశారంట.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రత్యేకంగా చూడటానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ కథ జరిగింది 24 ఏళ్ల క్రితం. అప్పుడు జూనియర్ వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే. ఎప్పుడూ టీవీలు, పత్రికల్లో చదవటం, వాళ్లూ వీళ్లూ చెబితే వినటమే కానీ.. ఎవరూ చెప్పింది లేదు. అచ్చం ఆ పోలికలతో ఉన్న తాతకు జరిగిన అన్యాయం, ద్రోహం, వెన్నుపోటు ఏంటో అప్పట్లో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. తాత అంటే రక్తం.. తాత పెట్టిన పార్టీ అంటే ప్రాణం.. ఈ కట్టెకాలే వరకు తాత పెట్టిన పార్టీని విడిచి పెట్టను అన్న ఎన్టీఆర్.. ఆ మాటకే కట్టుబడి ఉన్నారు.
కొన్ని వాస్తవాలు, నిజాలు బయటకు రావటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసి.. జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యారంట. తాత చనిపోయే సన్నివేశం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంట. పక్కన ఉన్న వారు ఓదార్చే ప్రయత్నం చేశారంట.
వైశ్రాయ్ హోటల్ దగ్గర తాతపై చెప్పులు పడుతున్న సీన్ చూసినప్పుడు ఎన్టీఆర్ కళ్లు ఎర్రబడ్డాయి అంటున్నారు అక్కడి వారు. మొత్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో.. 24 ఏళ్లుగా తెలుసుకోవాలనుకున్న వాస్తవాన్ని తెలుసుకున్న ఫీలింగ్ ఆయనలో కనిపించినట్లు సన్నిహితులు అంటున్నారు..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.