ఆధ్యాత్మికం వైపు నడుస్తున్న వంశోద్దారకుడు!

July 19, 2018

ఆ అబ్బాయి ప్రముఖ రాజకీయ, సినీ రంగానికి చెందిన వంశానికి వారసుడు. అతను తలచుకుంటే ఇప్పటికే సార్ట్ హీరో ఇమేజ్ దక్కించుకునే వాడు. అభిమానులు కూడా ఆకాశానికి ఎత్తేవారు. అనుకూల మీడియా ద్వారా అభినవ నట కిరీటం బిరుదులతో బలవంతంగా రుద్దేసేది.. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. వాస్తవం విరుద్ధంగా ఉంది. ఆ అబ్బాయి తీరు మరోలా ఉంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. మెత్తటి పరుపులపై పెరిగినా.. కాలికి ధూళి అంటకుండా తిరిగినా.. ఆ అబ్బాయికి ఆర్భాటం అబ్బలేదు. సామాన్యులపై మక్కువ పెరిగింది. అందరిలో ఒకడిగా కాకుండా అందరితో కలిసిమెలిసి తిరిగే తత్వం బోధపడింది. సౌఖ్యాలు, సుఖాలపై మోజు లేకుండా పోయింది. అయినా.. ఆ అబ్బాయికి రంగు వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది ఆ కుటుంబం.

ఎప్పుడో ఇవ్వాల్సిన ఎంట్రీ లేటుగా అయినా వస్తుందో రాదో తెలియదు. రంగుల ప్రపంచం నుంచి నడిరోడ్డుపై ఇంద్రధనస్సు చూడాలని కలలు కంటున్నాడు. ఆధ్యాత్మికం, సామాన్య జీవితంపైనే రోజురోజుకి మక్కువ పెరుగుతుంది ఆ అబ్బాయికి. అతి సామాన్య కుర్రోడిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటానికి ఇష్టపడుతున్నాడు. డబ్బుతో వచ్చిన పొడవాటి కార్లు కన్నా.. ఫ్రెండ్ బైక్ వెనక కూర్చుని జాయ్ జాయ్ అంటూ చక్కర్లు కొట్టటానికి ఇష్టపడుతున్నాడు. బంగారు పల్లెంలో భోజనం చేస్తే వచ్చే కిక్ కంటే.. రోడ్ సైడ్ అరటి ఆకులో తినే ఫుడ్ అంటేనే ఇష్టంగా తింటున్నాడు. స్పెషల్ ఫ్లయిట్స్ లో తిరిగే హోదా కంటే.. నలుగురితో కలిసి వోల్వో బస్సులో జర్నీకే మక్కువ చూపిస్తున్నాడు. ఆలయంలో ప్రత్యేక దర్శనం కంటే.. సామాన్య భక్తులతో కలిసి స్వామి సేవలో తరించటానికి తహతహలాడుతున్నాడు. తను వస్తున్నాడు అంటే ముందూ వెనకా ఉండే మందీ మార్భలం కంటే.. ఫ్యాన్స్ లో ఉండి ఈలలు, కేకలు వేయటానికే ఆరాటపడుతున్నాడు. తండ్రి చాటు బిడ్డగా.. కుటుంబంతో వచ్చిన మర్యాద కంటే.. తన స్వశక్తి ద్వారా వచ్చిన గుర్తింపునకు తహతహలాడుతున్నాడు.

అబ్బాయి ఆలోచనలు ఇలా ఉంటే.. ఆ కుటుంబం మాత్రం మరోలా తీర్చిదిద్దటానికి ఉబలాటపడుతుంది. వజ్రం రాయిగానే ఉంటుంది.. సానబెడితేనే మెరుపులు. అలా కాకుండా నల్లరాయిని ఎంత రుద్దినా అది వజ్రం కాదు. అలాగే మనసులో కసి ఉండాలి.. అందుకు విరుద్ధంగా ఎంత బలవంతం చేసినా అది నెగెటివ్ ఫలితాలనే ఇస్తుంది కదా.. ఇది ప్రకృతి సహజం.. మరి ఆ అబ్బాయి అడుగులు ఎటు పడతాయో చూడాలి… జీవితం ఎటువైపు తీసుకెళుతుంది చూడాలి…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.